ఓట్ల లెక్కింపునకు విజయనగరం జిల్లాలో దాదాపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. జెఎన్‌టియుజివిలో బొబ్బిలి, విజయనగరం, లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చీపురుపల్లి, రాజాం, గజపతినగరం, ఎస్.కోట, నెల్లిమర్ల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. జూన్ 6వ తేదీ వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, అప్పటివరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు మద్యం షాపులను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని లేదంటే ఆర్ఓల ద్వారా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా, శాంతియుతంగా పూర్తి చేసేందుకు ప్రతీఒక్కరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చేసిన ఏర్పాట్లను, శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి వివరించారు.