118 చైనా యాప్‌లపైనా నిషేధం
కేంద్ర ప్రభుత్వం చైనా యాప్‌లపై ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్ ఉండటంతో ఈ యాప్‌ను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్, యాపిల్ ప్లేసోర్ట నుంచి పబ్జీని తొలగించారు. పబ్జీతో పాటు బైడు, క్యామ్‌కార్డ్, విచాట్ రీడింగ్, టెన్సెంట్ వీన్, సైబర్ హంటర్, లైఫ్ ఆఫ్టర్ వంటి పలు యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది.
పబ్జీని దాదాపు 70 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ గేమ్‌కు యువత బానిసగా మారడంతో పబ్జీ గేమ్‌ను తొలగించాలని చాలాకాలంగా పలువురు కోరుతున్నారు. ఇక సరిహద్దుల్లో డ్రాగన్ దూకుడుతో ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా భద్రతా కారణాలతో టిక్‌టాక్ సహా 106 చైనా యాప్‌లను ఇటీవల భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే.